బాగుంది.కాం
శుక్రవారం, నవంబర్ 21 2008 | ఉదయం 5 గం 30 ని ( భారత కాలమానం ) బాగుంది.కాం వెబ్ సైట్ కు పునఃస్వాగతం!! english లో type చేయండి... తెలుగు లో చూడండి !! మార్పులు-చేర్పులు: సూచికలు-Bookmarks, తరచూ అడిగే ప్రశ్నలు, శ్రీశ్రీ రచనలు, GNU License యొక్క తెలుగు అనువాదం !!
కన్యాశుల్కము భాగములు

పూచీ వహించబడదు
(Disclaimer)

ఈ సైటు నందు పొందుపరచబడినటువంటి గురజాడ రచనలు, మరియు ఇతర గురజాడ సంబంధిత సమాచారం కేవలం స్వంత అభిరుచి మేరకు ఈ సైటు నందు ప్రచురించుట జరిగినది. ఇతరులు ఈ ప్రచురణను దుర్వినియోగ పరచిన, బాగుంది డాట్ కాం అందుకు భాధ్యత వహించదు. ఈ ప్రచురణను కాపీరైట్ హక్కుల ఉల్లంఘనగా పరిగణించబడిన, సంబంధిత వ్యక్తులు/సంస్థ విజ్ఞప్తి మేరకు ఈ ప్రచురణ మా సైటు నుండి తొలగింపబడుతుంది

కన్యాశుల్కము

ప్రధమాంకము 1.వ స్థలము. విజయనగరములో బొంకులదిబ్బ [గిరీశము ప్రవేశించును] గిరీశ : సాయంకాలమైంది. పూటకూళ్ళమ్మకు సంతలో సామాను కొని పెడతానని నెల రోజుల కిందట యిరవై రూపాయలు పట్టుకెళ్ళి డాన్సింగర్లు కింద ఖర్చుపెట్టాను. యీవాళ ఉదయం పూటకూళ్ళమ్మకీ నాకూ యుద్దవైఁపోయింది. బుర్ర బద్దలు కొడదామా అన్నంత కోపం వొచ్చింది గాని,పూర్రిచ్చర్డు చెప్పినట్లు పేషెన్సు వుంటేగాని లోకంలో నెగ్గలేం.ఈలా డబ్బు లాగేస్తె ఇదివరకు యెన్ని పర్యాయములు వూరుకుంది కాదు. యిప్పుడేదో కొంచం డాన్సింగర్లు మాట ఆచోకి కట్టినట్టు కనబడుతుంది.ఓర్వలేని వెధవ యెవడైనా చెప్పివుంటాడు.ఉదయం కథ ఆలోచిస్తే యిటు పైని తిండి పెట్టేటట్టు కానరాదు. యీవూళ్లో మరి మన పప్పువుడకదు. ఎటు చూసినా అందరికీ బాకీలే. వెంకుపంతులుగారి కోడలికి లవ్ లెటర్ రాసినందుకు యెప్పుడో ఒహప్పుడు సమయం కనిపెట్టి దేహశుద్ధి చేస్తారు. Can love be controll'd by advice ? Will cupid our mothers obey ? శీఘ్రంగా యిక్కణ్ణించి బిచాణా యెత్తి వెయ్యడమే బుద్ధికి లక్షణం; గాని మధురవాణిని వదలడమంటే యేమీ మనస్కరించకుండా వున్నది. It is women that seduce all mankind. నేను యేమో ఉద్యోగాలూ ఊళ్లూయేలి తనతో వైభవం వెలిగిస్తాననే నమ్మకం తో వుంది,పూర్ క్రీచర్! ఎవరా వస్తున్నది ? నా ప్రియశిష్యుడు వెంకటేశ్వర్లులా వున్నాడు.యీవాళ కిస్ మిస్ శలవులు యిచ్చివుంటారు.వీడి వైఖరి చూస్తే పరీక్ష ఫెలైనట్టు కనపడుతుంది.వీణ్ణి కొంచం వోదార్చి వీడికి శలవుల్లో చదువు చెప్పే మిషమీద వీడితో వీడి వూరికి వుడాయిస్తే చాలా చిక్కులు వదుల్తాయి; అట్నుంచి నరుక్కురమ్మన్నాడు. [వెంకటేశం ప్రవేశించును] యేమివాయ్ మై డియర్ షేక్స్పియర్, ముఖం వేలవేసినావ్? వెంక : యిక మీర్నాతో మాట్లాడకండి. మా మాష్టరు మీతో మాట్లాడొద్దన్నాడు.మీ సావాసం చెయడంచాత నా పరీక్ష పోయిందని అన్నారు. గిరీశ : నాన్సెన్స్.మొదట్నుంచీ నేను అనుమానిస్తూనే వున్నాను. నీ మాష్టరికి నన్ను చూస్తే కిట్టదు. అందుచాత నిన్ను ఫెయిల్ చేశాడు గాని లేకుంటే నువ్వేవిఁటి ఫెయిల్ కావడవేవిఁటి! అతనికీ నాకూ యెందుకు విరోధం వొచ్చిందో తెలిసిందా? అతను చెప్పేదంతా తప్పుల తడక. అది నేను న్యూసు పాపర్లో యేకేశాను. అప్పట్నుంచీ నేనంటే వాడిక్కడుపుడుకు. వెంక : మీవల్లనాకు ఒచ్చిందల్లా చుట్ట కాల్చడం వొక్కటే. పాఠం చెప్పమంటే యెప్పుడూ కబుర్లు చెప్పడవేఁకాని ఒకమారయినా ఒక ముక్క చెప్పిన పాపాన్ని పోయినారూ? గిరీశ : డామిట్. ఇలాటి మాటలంటే నాకు కోపం వస్తుంది. ఇది బేస్ ఇన్గ్రాటిట్యూడ్. నాతో మాట్లాడడవేఁ ఒక ఎడ్యుకేషన్. ఆ మాటకొస్తె నీకున్న లాంగ్వేజి నీ మాష్టరుకుందీ? విడో మారియేజి విషయమై నీకు యెన్ని లెక్చర్లు యిచ్చాను! నా దగ్గిర చదువుకున్నవాడు ఒహడూ అప్రయోజకుడు కాలేదు. పూనా డక్కన్ కాలేజిలో నేను చదువుతున్నప్పుడు ది ఇలెవెన్ కాజస్ ఫర్ది డిజనరేషన్ ఆఫ్ ఇండియాను గూర్చి మూడు ఘంటలు ఒక్కబిగిని లెక్చర్ యిచ్చేసరికి ప్రొఫెసర్లు డంగయిపోయినారు. మొన్న బంగాళీవాడు యీ వూళ్ళో లెక్చరిచ్చినపుడు ఒకడికైనా నోరు పెగిలిందీ? మనవాళ్ళు వుట్టి వెధవాయలోయ్, చుట్ట నేర్పినందుకు థాంక్ చెయ్క, తప్పుపట్టుతున్నావ్? చుట్టకాల్చడం యొక్క మజా నీకు యింకా బోధపడకపోవడం చాలా ఆశ్చర్యంగా వుంది. చుట్ట కాల్చబట్టే కదా దొర్లింత గొప్పవాళ్ళయినారు. చుట్ట కాల్చని యింగ్లీషువాణ్ణి చూశావూ? చుట్టపంపిణి మీదనే స్టీముయంత్రం వగయిరా తెల్లవాడు కనిపెట్టాడు. లేకపోతే వాడికి పట్టుబణ్ణా? శాస్త్రకారుడు యేవఁన్నాడో చెప్పానే. సూత ఉవాచ-క ll ఖగపతియమృతముతేగా l భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్l పొగచెట్టై జన్మించెను l పొగతాగనివాడు దున్నపోతైబుట్టునూ ll యిది బృహన్నారదీయం నాలుగవ అశ్వాసంలో వున్నది. అది అలావుణ్ణీగాని నీ అంత తెలివైన కుర్రవాణ్ణి ఫెయిల్ చేసినందుకు నీ మాష్టరు మీద నావళ్ళు మహా మండుతూంది. ఈ మాటు వంటరిగా చూసి వక తడాఖాతీస్తాను. నువ్వు శలవుల్లో యిక్కడుంటావా వూరికి వెళతావా? వెంక : వెళ్ళాల్నుందిగానీ, పాసుకాలేదంటే మా తండ్రి చావ కొడతాడు. గిరీశ : ఆగడం తప్పే వుపాయం నేన్చెబుతాను, నే చెప్పినట్టల్లా వింటానని ప్రమాణం చాస్తావూ? వెంక : (గిరీశం కాళ్ళుపట్టుకొని) మీ శలవు యెప్పుడు తప్పాను? మా తండ్రికి మా చడ్డ కోపం. పాసుకాలేదంటే యెవిఁకలు విరగ్గొడతాడు (కన్నీరు చేత తుడుచు కొనును) గిరీశ : దటీజ్ టిరనీ-యిదే బంగాళీ కుర్రవాడవుతే యేంజేస్తాడో తెలిసిందా? తాతయేది తండ్రియేది కర్ర పట్టుకుని చమ్డాలెక్కగొడతాడు; మీ అగ్రహారం కుర్రవాళ్ళు మరియవళ్ళయినా యీ వూళ్ళో చదువుకుంటున్నారా? వెంక : మరెవళ్ళూ లేరు. గిరీశ : ఐతే నేనూ వుపాయం చెపుతాను విను, నే కూడా నీతో మీవూరొచ్చి పరీక్ష పాసయినావని మీ వాళ్లతో చెబుతాను; అక్కడ నీకు చదువు చెప్పడానికి ఒచ్చానని మీ వాళ్లతో చెప్పు; శెలవులాఖర్ని నిన్ను టవును స్కూల్లో పైక్లాసులో ప్రవేశపెడతాను. వెంక : మీరే వస్తే బతికాను మరేవిఁటి; కిందటి మాటు శలవులకే మా అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మంది. గిరీశ : ఆల్రైట్-గాని-నాకిక్కడ చాలా వ్యవహారములలో నష్టంవస్తుందే-మునసబుగారి పిల్లల్కి శలవుల్లో పాఠాల్చెపితె ఫిప్టీ రుపీజ్ యిస్తావఁన్నారు; అయినా నీ విషయవైఁయంత లాస్ వచ్చినా నేను కేర్ చెయ్యను. ఒక భయం మాత్రం వుంది. మీవాళ్లు బార్ బరస్ పీపిల్ గదా, నన్ను తిన్నగా ట్రీట్ చేస్తారో చెయ్యరో, నీవు నన్ను గురించి మీ మదర్ తో గట్టిగా రికమెండ్ చెయ్యవలసి వుంటుంది. కొత్త పుస్తకాలికి వక జాబితా రాయి-కొంచం డబ్బు చేతిలోవుంటేనే గాని సిగర్సుకి యిబ్బంది కలుగుతుంది. నోటు బుక్కు తీసి రాయి. 1 రోయల్ రీడర్, 2 మాన్యూల్ గ్రామర్, 3 గోష్ జియామెట్రీ, 4 బాస్ ఆల్జిబ్రా, 5 శ్రీనివాస్సయర్ అర్థిమెటిక్, 6 నలచరిత్ర, 7 రాజశేఖర చరిత్ర, 8 షెపర్డు జనరల్ ఇంగ్లీష్, 9 వెంకటసుబ్బారావు మేదిజీ. యెన్ని పుస్తకాలయినాయి? వెంక : తొమ్మిది. గిరీశ : మరొక్కటి రాయి. అక్కడికి పదీ అవుతాయి. కుప్పుసామయ్యర్ మేడ్ డిఫికల్ట్. అక్కడికి చాల్ను. మీవాళ్లు గాని యింగ్లీషు మాట్లాడ మన్నట్టాయినా తణుకూ బెణుకూ లేకుండా పుస్తకాల్లో చదువుకున్న ముక్కలు జ్ఞాపకం వున్నంతవరకు యాకరు పెట్టు. నీదగ్గిర కాపర్సు యేవైఁనా వున్నవా? నా దగ్గిర కరన్సీనోట్లు వున్నవి గాని మార్చ లేదు. పదణాలు పెట్టి ఓ శేరు కాశీ మిఠాయికొని పట్టుకురా. రాత్రి మరి నేను భోజనం చెయ్యను. మార్కట్టుకి వెళ్లి బండీ కుదిర్చి దానిమీద నా ట్రావెలింగ్ ట్రంక్కు వేశి మెట్టుదగ్గిర బండీ నిలబెట్టివుంచు. యిక్కడ కొన్ని రాచకార్యాలు చక్కబెట్టుకుని యంతరాత్రికైనా వొచ్చి కల్సుకుంటాను. గో ఎట్వన్స్, మై గుడ్ బోయ్. నువ్ బుద్ధిగావుండి చెప్పిన మాటల్లా వింటూంటే నిన్ను సురేంద్ర నాధ్ బానర్జీ అంత గొప్పవాణ్ణి చేస్తాను. నేను నీతో వస్తానన్నమాట మాత్రం పిట్టకైనా తెలియనియ్యొద్దు. జాగ్రత. (వెంకటేశం నిష్క్రమించును.) గిరీశ : యీ వ్యవహార మొహటి ఫైసలైంది. ఈ రాత్రి మధురవాణికి పార్టింగ్ విజిట్ యివ్వందీ పోకూడదు. [రాగవరసతో పాడును.] నీ సైటు నాడి లైటు; నిన్ను మిన్న కానకున్న క్వైటు రెచడ్ ప్లైటు మూనులేని నైటు. [ఒక బంట్రోతు ప్రవేశించును.] బంట్రోతు : నేను పొటిగరాప్పంతులుగారి నౌఖర్నండి, లెక్క జరూరుగుందండి, పొటిగరావుల కరీదు యెంటనె యిప్పించమన్నారండి. గిరీశ : (విననట్టు నటించుతూ) పుల్లుమూను లైటటా, జాసమిన్ను వైటాటా, మూనుకన్న మొల్ల కన్న నీదుమోము బ్రైటటా టా ! టా ! టా ! బంట్రోతు : యంతమందిని పంపినా యిచ్చారు కారటండి, నేనాళ్ళ లాగూరుకుండే వాణ్ణికానండి. గిరీశ : అయ్యకోనేటికి తోవ యిదే! బంట్రోతు : యక్కడి శెవిఁటి మాలోకం వచ్చిందయ్యా. గిరీశ : కోవఁటి దుకాణవాఁ? కస్పా బజార్లోగాని యిటివేపులేదు. బంట్రోతు : (గట్టిగా చెవిదగ్గిర నోరుపెట్టి) పొటిగరాపులు కరీదిస్తారా యివ్వరా? గిరీశ : బస,రాధారీ బంగాళాలో చెయ్యొచ్చును. బంట్రోతు : (మరీగట్టిగా) యాడాది కిందట మీరూ సాన్దీ కలిసి యేసుకున్న పోటిగరాపుల కరీదు మా పంతులు నిలబెట్టి పుచ్చుకొమ్మన్నారు. గిరీశ : ఓహూ నీవటోయ్, యవరో అనుకున్నాను.నింపాదిగా మాట్లాడు, నింపాదిగా మాట్లాడు. రేపు వుదయం యెనిమిది ఘంటలకి పూటకూళమ్మ యింటికి వస్తే అణా ఫయిసల్తో సొమ్మిచ్చేస్తాను. మీ పంతులికి స్నేహం మంచీ చెడ్డా అక్కర్లేదూ? బంట్రోతు : మాటల్తో కార్యం లేదు. మొల్లోశెయ్యెట్టి నిలున్నపాట్ని పుచ్చుకొమ్మన్నారండి. గిరీశ : పెద్ద మనిషివి గదా ; నువ్వూ తొందరపడ్డం మంచిదేనా? నీ తండ్రి యంత పెద్ద మనిషి.యీ చుట్ట చూడు యంత మజాగా కాల్తుందో. హవానా అంటారు దొర్లు దీన్ని.రేప్పొద్దున్న రా రెండు కట్టలిస్తాను. బంట్రోతు : శిత్తం సొమ్ము మాటేం శలవండి. గిరీశ : చెప్పానుకానా ? రేప్పొద్దున్న యివ్వకపోతే మాలవాడి కొడుకు ఛండాలుడు. బంట్రోతు : మాలడికొడుకు శండాలుడు కాకుంటే మరేటండి. గిరీశ : నీకు నమ్మకం చాలకపోతే యిదిగో గాయత్రీ పట్టుకు ప్రమాణం చేస్తాను. బంట్రోతు : శిత్తం, రేపు పొద్దున్న సొమ్మియ్యకపోతే నా ఆబోరుండదండి. గిరీశ : ఆహా. నీ ఆబోరు ఒహటీ, నా ఆబోరు ఒహటీనా? (బంట్రోతు నిష్క్రమించును.) ఇన్నాళ్లకి జంఝప్పోస వినియోగంల్లోకి వచ్చింది.ధియాసొఫిస్టుసు చెప్పినట్లు మన ఆత్మానుభవం అయితేనేగాని తత్వం బోధపడదు.ఈ పిశాచాన్ని వదుల్చుకునేసరికి తల ప్రాణంతోక్కొచ్చింది.శీఘ్రబుద్దేః పలాయనం.పెందరాళే యీ వుర్నించి వుడాయిస్తేనే కాని ఆబోరు దక్కదు. యిక మధురవాణి యింటికి వెళదాం. మేక్ హే వైల్దీ సన్ షైన్స్ అన్నాడు.
గురజాడ గురించి...


పేరు:  గురజాడ
అసలు పేరు:  గురజాడ వెంకట అప్పారావు
జన్మస్థలం:  రాయవరం, విశాఖపట్నం
జననం:  సెప్టెంబర్ ౨౧, ౧౮౬౨
మరణం:  సెప్టెంబర్ ౩౦, ౧౯౧౫

రచనలు:  కన్యాశుల్కము,॥।

అవార్డులు:  
:  


Copyright © 2003-2004, www.baagundi.com. All Rights Reserved.